ఓవైపు గులాబీ దండు.. మరోవైపు కాషాయ దళం.. అటు కాంగ్రెస్ శ్రేణులు.. దేశమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక, మునుగోడు ఎన్నికలపై ఎగ్జిట్ పోల్ సర్వేలు తమ నివేదికలను ప్రకటిస్తున్నాయి. ఎన్నికల సరళిపై పలు సర్వేలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అనే దానిపై ఇప్పటి నుంచే అంచనాలు పెరిగిపోయాయి. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్‌లో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ పోరుమాత్రమే ఉందని స్పష్టమవుతోంది. కాంగ్రెస్ మూడో స్థానంలోకి పడిపోయిందని సర్వేలు వెలువడుతున్నాయి. ఈ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో ఫలితాలు అధికార పార్టీ టీఆర్ఎస్కు అనుకూలంగానే ఉండనున్నట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
మీడియాబాస్-గేమ్ ఛేంజర్ ( #GameChanzer ) సంస్థలు కలిసి నిర్వహించిన ఎగ్జిట్‌పోల్ ప్రకారం టీఆర్ఎస్ 41 శాతం ఓట్లతో గెలుపు ఖాయమని స్పష్టమవుతోంది. ఇక బీజేపీ 36 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ 16 శాతం ఓట్లతో మూడో స్థానానికి పరిమితమవుతోంది. బీఎస్పీ 3 శాతం ఓట్లు, ఇతరులు 4 శాతం ఓట్లు సాధించే అవకాశం కనిపిస్తున్నట్టు మీడియాబాస్-గేమ్ ఛేంజర్ ఎగ్జిట్‌పోల్ ఫలితాలు చెబుతున్నాయి. ఇదే సంస్థ మునుగోడు ఎన్నికలకు ముందు నిర్వహించిన రెండు సర్వేల్లో కూడా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని తేల్చింది.